Reviews

యాత్ర 2 రివ్యూ

విడుదల తేదీ : ఫిబ్రవరి 08, 2024

 రేటింగ్ : 3/5

నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, ఆశ్రిత వేముగంటి నండూరి

దర్శకుడు : మహి వి రాఘవ్

నిర్మాత: శివ మేక

సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: మధీ

ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

హీరో జీవా, మళయాళ సీనియర్ హీరో మమ్ముట్టి కీలక పాత్రల్లో దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన చిత్రమే “యాత్ర 2”. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

వైఎస్ రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) తన కొడుకు జగన్ (జీవా) ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడుతున్నాను అని ప్రజలకు పరిచయం చేస్తూ ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత.. ఎన్నికల్లో గెలవడం, వైఎస్సార్ సీఎం అవ్వడం చూపిస్తారు. ఐతే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘పరామర్శ యాత్రను’ ఆపేయమనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టి, బై ఎలక్షన్స్ లో గెలుస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య జగన్ పై సీబీఐ దాడులు జరుగుతాయి. జగన్ అరెస్ట్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు (మహేష్ మంజ్రేకర్) సీఎం అవ్వడం, మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండటం వంటి సంఘటనలు జరుగుతాయి. చివరకు జగన్ పాదయాత్రను ఎలా చేశాడు ?, చివర్లో 2019 లో జగన్ సీఎం ఎలా అయ్యాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెమీ బయోపిక్ గా వచ్చిన ఈ యాత్ర 2 లో వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలను, అలాగే తన తండ్రి బాటలో నడవాలనే తన లక్ష్యాన్ని జగన్ ఎలా గ్రహించాడు ?, ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు ?, చివరకు సొంతంగా పార్టీ పెట్టి, సమర్ధవంతంగా ఆ పార్టీని నడిపించి.. చివరకు అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు ? వంటి అంశాలు సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి. మహి వి రాఘవ దర్శకత్వం కూడా బాగుంది.

హీరో జీవా వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా చాలా బాగా నటించాడు. లెజెండరీ నటుడు మమ్ముట్టి కూడా ‘యాత్ర 2’ లో కనిపిస్తారు. ఆయన కూడా అద్భుతంగా నటించారు. అదే విధంగా ఈ సినిమాలో సోనియా పాత్రలో జర్మన్ నటి సుజానే బెర్నెర్ట్ కూడా చాలా బాగా నటించింది. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్ కూడా చక్కగా నటించాడు.

 

 

అదేవిధంగా మిగిలిన ప్రధాన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయా ఒరిజినల్ పాత్రలను బాగా ఇమిటేట్ చేస్తూ నటులందరూ ఆకట్టుకున్నారు. మొత్తానికి దర్శకుడు రాసుకున్న సీన్లు మరియు ఎమోషన్స్ అండ్ పాత్రల ఎలివేషన్స్ కొన్ని చోట్ల ఆసక్తిగా సాగుతూ ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు మహి వి రాఘవ తీసుకున్న వాస్తవిక కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా స్లోగా సాగుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోని కొన్ని సీక్వెన్సెస్ అలాగే సెకండాఫ్ స్టార్టింగ్ సీక్వెన్సెస్ ఆసక్తికరంగా సాగలేదు. ఇక జగన్ – ప్రత్యర్థి పార్టీ నాయకుల మధ్య వచ్చే కొన్ని రాజకీయ సన్నివేశాలు కూడా చాలా రెగ్యులర్ గానే అనిపిస్తాయి.

మొత్తానికి దర్శకుడు తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ పొలిటికల్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది. అలాగే, స్క్రీన్ ప్లే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఇంటర్వెల్ లో ఎమోషన్స్ పెంచి… సెకండాఫ్ పై కొంత ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేసినా.. అది అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ఇక క్లైమాక్స్‌ కూడా అందరూ ఊహించిన విధంగానే సాగింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. మహి వి రాఘవ దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే, ఆయన టేకింగ్ కూడా చాలా బాగుంది. కానీ, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన తడబడ్డారు. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాత శివ మేక పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

పొలిటికల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘యాత్ర 2’ జగన్ అభిమానులకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు ఓ ఎమోషనల్ ఫీస్ట్ గా నిలుస్తోంది. జగన్ పొలిటికల్ గ్రాఫ్ తో పాటు వైఎస్ఆర్ – జగన్ మధ్య ఎమోషన్స్ మరియు బాండింగ్ కూడా ఆకట్టుకున్నాయి. అలాగే, బీజీఎం, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఐతే, ఈ సినిమాలో కొన్ని సీక్వెన్సెస్ స్లోగా సాగడం, అలాగే రొటీన్ గా సాగే కొన్ని పొలిటికల్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే, మమ్ముట్టి – జీవా తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకువెళ్లారు. ఓవరాల్ గా ఈ ‘యాత్ర 2’ చిత్రం వైసీపీ అభిమానులను చాలా బాగా మెప్పిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *