-
సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీకి రెడీ అయిన రంభ
టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్‌లో కూడా స్టార్‌గా వెలుగొందిన ఘనత రంభకు చెందింది. విజయవాడకి చెందిన ఈ తెలుగు అమ్మాయి అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లో రంభ అనే స్క్రీన్ నేమ్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ కాలంలో దాదాపు అన్నీ టాప్ హీరోలతో నటించింది. బాలీవుడ్ సినిమాల్లోనూ మెరిసింది. చివరిసారిగా ‘దేశముదురు’ చిత్రంలోని ఐటెం సాంగ్‌లో కనిపించింది. అనంతరం పెళ్లి చేసుకుని కెనడాలో స్థిరపడిపోయింది.
ఇటీవల రంభ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓ టీవీ డ్యాన్స్ షోలో జడ్జ్‌గా మారి మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాల్లోకి రీఎంట్రీకి సిద్దమవుతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.
రంభ చెప్పిన వివరాల ప్రకారం, పెళ్లి తర్వాత కెనడాలో స్థిరపడిందని, తల్లి అయిన తర్వాత పిల్లల బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో సినిమాలకు కొంతకాలం విరామమిచ్చిందని తెలిపింది. తనకు 6 ఏళ్ల అబ్బాయి, 14 మరియు 10 ఏళ్ల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని చెప్పింది. ప్రస్తుతం వారు స్వయంగా తమ పనులు చేసుకునే స్థాయికి వచ్చారని, అందుకే మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట.
సినిమాలపై తనకు ఉన్న ఆసక్తి గురించి భర్తకు తెలుసని, ఆమె మళ్లీ నటించాలంటే భర్త కూడా అంగీకరించాడని చెప్పింది. ఓ డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరించాను, ఆ షోకు ముందు భయం వేసిందని కానీ చివరికి ఆ అనుభవం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపింది. ప్రేక్షకుల స్పందన తనలో మళ్లీ ఉత్సాహాన్ని నింపిందట.
తనతో నటించిన చాలా మంది ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నారని, వాళ్ల సహాయం కూడా తనకు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రస్తుతం తన చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయని, త్వరలోనే తాను నటించబోయే సినిమా గురించి అధికారికంగా ప్రకటించబోతున్నట్టు రంభ తెలిపింది.