-
ఏఎం రత్నం, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ తో పవన్ భేటీ!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పెండింగ్‌లో ఉన్న సినిమా ప్రాజెక్టులపై మరింత దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిన్న ఆయన సినీ నిర్మాతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నప్పటికీ, తన సినీ కమిట్‌మెంట్లను నెరవేర్చేందుకు పవన్ చురుకుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు ఏఎం రత్నం, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు పాల్గొన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎన్నో సార్లు వాయిదా పడిన ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలన్న దిశగా పవన్ ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. మిగిలిన షూటింగ్‌ను త్వరగా ముగించి, వచ్చే ఏడాది మేలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని పవన్ నిర్మాతలకు హామీ ఇచ్చినట్టు టాక్.
అంతేకాదు, పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో రెండు ప్రాజెక్టులు — సుజిత్ దర్శకత్వంలోని ‘ఓజీ’, హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం జూలై నుంచి డేట్లు కేటాయిస్తానని పవన్ నిర్మాతలకు చెప్పినట్లు సమాచారం.
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక కీలక వ్యాఖ్య చేసినట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో తన సినీ ప్రయాణానికి గుడ్‌బై చెప్పే అవకాశం ఉందన్న సంకేతాలను పవన్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం డిప్యూటీ ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ, తన సినీ బాధ్యతలను సైతం సమర్థవంతంగా నిర్వర్తించేందుకు పవన్ తీసుకుంటున్న ఈ నిర్ణయం నిర్మాతలు, అభిమానుల హృదయాలకు తేలిక కలిగించినట్లు కనిపిస్తోంది.
Read : Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ