-
శుభం సినిమాతో నిర్మాతగా మారిన సమంత
ప్రముఖ నటి సమంత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు సెట్స్‌పై లేవు. చివరగా విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషీ సినిమా తరువాత, ఆమె కొత్త ప్రాజెక్ట్ అంగీకరించలేదు. ప్రస్తుతం తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే పూర్తి ఫిట్నెస్తో కొత్త చిత్రాలను చేపట్టనుందని సమాచారం.
ఇదిలా ఉండగా, సమంత ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. ఆమె స్వంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై తొలి చిత్రంగా శుభం అనే తెలుగు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఆమె పూర్తి స్థాయి నిర్మాతగా అరంగేట్రం చేయనున్నారు. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వసంత్ మరిగంటి కథ అందించారు. పూర్తి వినోదాత్మకంగా ఉండడంతో పాటు థ్రిల్లింగ్ అంశాలను కలిగి ఉన్న ఈ సినిమాలో సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణిలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. మృదుల్ సుజిత్‌సేన్ సినిమాటోగ్రఫీని, రామ్‌చరణ్ తేజ్ ప్రొడక్షన్ డిజైన్‌ను, ధర్మేంద్ర కాకర్లాడ్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.