-
‘రాబిన్‌హుడ్’ ఈవెంట్లో వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆదివారం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు.
ఈ ఈవెంట్లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వార్నర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, దీనిపై నెటిజన్లు విమర్శలు చేశారు.
తాజాగా ఈ అంశంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. “నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. రాబిన్‌హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ గురించి నేను అనుకోకుండా కొన్ని మాటలు మాట్లాడాను. అవి ఉద్దేశపూర్వకంగా చెప్పినవి కావు. ఫంక్షన్‌కి ముందు మేమంతా కలిసి ముచ్చటించాం. ఎంతో అల్లరి చేశాం. నితిన్‌ను, వార్నర్‌ను నా పిల్లల్లాంటి వారే అని అనుకున్నాను.
ఈ సందర్భంలో వార్నర్‌ను ఉద్దేశించి ‘నువ్వు యాక్టింగ్‌లోకి వస్తున్నావుగా? నీ సంగతి చెప్తా’ అన్నా. దానికి ఆయన ‘మీరు క్రికెట్లోకి రండి, మీ సంగతి చెప్తా’ అని స్పందించారు. మేమిద్దరం సరదాగా మాట్లాడుకున్నాం. అయినా నా మాటలు ఎవ్వరినైనా బాధపెట్టినట్లయితే క్షమించండి.
నేను వార్నర్‌ను ప్రేమిస్తున్నాను, అతని క్రికెట్‌ను అభిమానిస్తున్నాను. అలాగే, వార్నర్ కూడా మన సినిమాలు, మన యాక్టింగ్‌ను ఇష్టపడతాడు. మేమిద్దరం మంచి స్నేహితులం. అయినా జరిగిన సంఘటనతో ఎవరి మనసయినా బాధపడి ఉంటే మన్నించండి. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదు. ఇక నుంచి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటా” అని ఆయన వివరించారు.