-
నాగచైతన్య రెస్టారెంట్ పై ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
హీరో నాగచైతన్య ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన స్థాపించిన రెస్టారెంట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది ఎప్పుడు జరిగిందంటే… జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ మూవీ దేవర జపనీస్ వర్షన్ మార్చి 28న జపాన్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వివిధ అంశాలపై మాట్లాడుతుండగా, ఫుడ్ గురించి చర్చ వచ్చింది. అప్పుడు ఆయన నాగచైతన్య రెస్టారెంట్ గురించి ప్రస్తావించారు. “జపనీస్ ఫుడ్ కావాలంటే కచ్చితంగా హైదరాబాద్‌లోని షోయూ రెస్టారెంట్‌కు వెళ్లండి. ఇది నా స్నేహితుడు, నటుడు నాగచైతన్య ప్రారంభించిన రెస్టారెంట్. అక్కడ విభిన్న రకాల డిషెస్ అందుబాటులో ఉంటాయి” అని తెలిపారు.
అలాగే, తాను సుషీను ఎంతో ఇష్టపడతానని, అది ఎంతో అద్భుతమైన ఫుడ్ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.