కాకినాడ శ్రీదేవి – ‘కోర్ట్’తో కొత్త స్టార్ జన్మించిందా?
‘కోర్ట్’ సినిమా చూసినవారికి ఈ కాకినాడ బ్యూటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలకు ముందే ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ ద్వారా ఈ అమ్మాయిని చూసినా, పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. గ్లామర్ షో లేకపోయినా, ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉందని మాత్రమే అనుకున్నారు. కానీ, నిన్న సినిమా చూసినవాళ్లు శ్రీదేవి అభిమానులుగా మారిపోతూ థియేటర్ నుంచి బయటకొచ్చారు. ఆ మార్పుకి కారణం – ఆమె సహజమైన నటన.
శ్రీదేవి – ఆరంభం నుంచి ‘జాబిల్లి’గా ముద్ర వేసిన నటన
ఇంతకుముందు కొన్ని చిన్న పాత్రలు చేసినట్టు శ్రీదేవి ఇంటర్వ్యూల్లో చెప్పింది. కానీ, ఆ సినిమాలు ఇప్పుడు చూసినా గుర్తు పట్టలేమేమో! కాకినాడలో ఇంటర్ చదువుకుంటూ, రీల్స్ చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మాయికి ‘కోర్ట్’ నుంచి ఛాన్స్ వచ్చింది. అయితే వచ్చిన అవకాశాన్ని శ్రీదేవి వదులుకోకుండా తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘జాబిల్లి’గా ఆమె పాత్రలో నిండుగా ఒదిగిపోయింది. ఎంతో అనుభవం ఉన్న నటుల్లా తన హావభావాలతో కళ్లతోనే పలికించగలిగింది.
ఈ సన్నివేశాల్లో శ్రీదేవి నటన మరచిపోలేనిది:
చందు కాల్ చేసినప్పుడు – బ్యాగులో ఫోన్ తీస్తూ దొరికిపోవడం
తప్పు చేయలేదని తల్లిని హత్తుకునే సన్నివేశం
కోర్టులో చందును చూసి భావోద్వేగానికి లోనయ్యే సీన్
క్లైమాక్స్‌లో ఆమె హావభావాలు
పెళ్లికి వెళ్లినపుడు, చందుకు కళ్లతో ‘సైగ’ ఇచ్చే మూమెంట్ – ఈ ఒక్క సీన్ చాలు, ఈ అమ్మాయి గొప్ప ఆర్టిస్ట్ అవుతుందని చెప్పడానికి!
తెలుగు సినిమా కొత్త ‘నేచురల్’ హీరోయిన్?
సాధారణంగా, ఇలాంటి సహజమైన నటన మలయాళ సినిమాల్లో చూస్తూ ఉంటాం. కానీ, హీరోయిన్‌గా తొలి చిత్రంలోనే శ్రీదేవి తన టాలెంట్ చూపించింది.
కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం పరంగా ‘కోర్ట్’ మెప్పించిందని చెప్పడంలో సందేహమే లేదు. అయితే, శివాజీ, ప్రియదర్శి తరువాత ఎక్కువ మార్కులు శ్రీదేవికే దక్కుతాయి. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ ఆమె నటనే.
ఇప్పుడు “కాకినాడ అమ్మాయి ఇంత బాగా నటించిందా?” అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అంజలి, స్వాతి, ఆనంది వంటి తెలుగు హీరోయిన్ల తరవాత, అదే స్థాయిలో శ్రీదేవి కొత్త జెండా ఎగరేస్తుందేమో చూడాలి!