పుష్ప 2 మూవీ రివ్యూ
పుష్ప 2 మూవీ రివ్యూ :
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 వచ్చింది. గత మూడేళ్ళుగా ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 సినిమా నేడు డిసెంబర్ 5న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ చేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్, రావు రమేష్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, ధనుంజయ, శ్రీతేజ.. పలువురు నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు.
కథ విషయానికొస్తే.. పుష్ప రాజ్(అల్లుఅర్జున్) ఎర్రచందనం సిండికేట్ ప్రసిడెంట్ గా బాగా ఎదుగుతాడు. చిత్తూర్ మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకొని ఎర్ర చందనం స్మగ్లింగ్ తో బాగా సంపాదిస్తాడు. ఓ సారి సీఎంని కలవడానికి వెళ్తుంటే తన భార్య శ్రీవల్లి(రష్మిక) సీఎంతో ఫోటో దిగి రా ఇంట్లో పెట్టుకుందాం అంటే సరే అంటాడు. కానీ సీఎం ఇలాంటి స్మగ్లర్స్ లో ఫోటో దిగకూడదు అని ఫోటో ఇవ్వడు. దీంతో పుష్ప ఈగో దెబ్బ తిని తనకి సపోర్ట్ చేస్తున్న సిద్దప్ప(రావు రమేష్)ని సీఎం చేస్తా అంటాడు. అందుకు డబ్బుల కోసం పుష్ప పెద్ద ఎత్తున ఎర్రచందనం డీలింగ్ చేసి 2000 టన్నులతో ఒకేసారి 5000 కోట్ల టార్గెట్ తో పనిచేస్తూ ఉంటాడు.
దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని భన్వర్ సింగ్ షెకావత్(ఫాహద్ ఫాజిల్), దాక్షాయణి(అనసూయ) ట్రై చేస్తూ ఉంటారు. మరో వైపు మోహన్ రాజ్(అజయ్) పుష్పని తమ్ముడిలా ఎప్పుడు ఒప్పుకుంటాడా అని పుష్ప బాధపడతాడు. మరి ఎర్రచందనం దేశం దాటించాడా? 5000 కోట్ల డీల్ సక్సెస్ అయిందా? భన్వర్ సింగ్ షెకావత్ పుష్పని అడ్డుకున్నాడా? ద్రాక్షాయని ఎందుకు పుష్పని అడ్డుకోవాలని చూస్తుంది? పుష్పని తన కుటుంబం అని మోహన్ ఒప్పుకుంటాడా? సిద్ధప్ప సీఎం అవుతాడా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. పుష్ప 1 పెద్ద హిట్ అవ్వడంతో పార్ట్ 2 పై అంచనాలు భారీగా పెరిగాయి. దానికి తగ్గట్టు సుకుమార్ చాలా టైం తీసుకొని పుష్ప 2 తీసాడు. పార్ట్ 1లో ఎర్రచందనం కూలి నుంచి సిండికేట్ ప్రసిడెంట్ గా ఎదగడం చూపిస్తే పార్ట్ 2 సిండికేట్ ప్రసిడెంట్ గా ఎదిగాక ఏం చేసాడు? స్టేట్ సీఎంనే మార్చేలా ఎలా ఎదిగాడు అని చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా పుష్ప గురించి, శ్రీవల్లి సీఎం ఫోటో అడగటం, సీఎం ఫోటో ఇవ్వకపోవడంతో సిద్దప్పని సీఎం చేయడం కోసం పుష్ప పనిచేయడం, భన్వర్ సింగ్ షెకావత్ తో గొడవతో సాగుతుంది. ఇంటర్వెల్ కి పుష్ప – షెకావత్ మధ్య సవాల్ తో మంచి హై మూమెంట్ ఇచ్చారు. ఇక సెకండ్ హాఫ్ లో ఎర్రచందనం డీల్ ఎలా పూర్తిచేసాడు? షెకావత్ ఏం చేసాడు? ఫ్యామిలీ సెంటిమెంట్ తో నడిపించారు. అయితే కథ ముఖ్యంగా ఈగోల మీదే నడుస్తుంది. సీఎం ఫొటో ఇవ్వలేదని, అలాగే షెకావత్ తో పుష్పకు ఈగోలు వచ్చి కథ సాగుతూ వస్తుంది.
ఫస్ట్ హాఫ్ లో రష్మికతో కొంత రొమాన్స్, కామెడీ నడిపించారు. ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. బన్నీకి అదిరిపోయే ఎలివేషన్స్ పడ్డాయి. కొన్ని సీక్వెన్స్ అయితే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తాయి. జాతర సీక్వెన్స్ తో పాటు ఇంకో ఫైట్ సీన్ కూడా అదిరిపోతుంది. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ ని బాగా వర్కౌట్ చేసారు. కొన్ని సీన్స్ కి కంటతడి పెట్టాల్సిందే. ఆడపిల్ల మీద చెయ్యేస్తే ఊరుకోవద్దని కొన్ని సీన్స్ బాగానే డిజైన్ చేసారు. ఐటెం సాంగ్ కూడా బాగానే వర్కౌట్ అయింది. పుష్ప – శ్రీవల్లి మధ్య భార్య భర్తల రిలేషన్ చాలా బాగా చూపించారు.
స్టార్టింగ్ పది నిముషాలు ఇంట్రడక్షన్ ఫైట్ కు కథకు మాత్రం సంబంధం లేదు. కానీ అది పార్ట్ 3కి లింక్ ఉండొచ్చు అని తెలుస్తుంది. అయితే ఇందులో అది కూడా ఓపెనింగ్ సీన్ తో ఎందుకు చుపించారో అర్ధం కాదు. రష్మిక – అల్లు అర్జున్ రొమాంటిక్ సీన్స్ కొంచెం ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో కొంచెం సాగదీశారు. ఇక పార్ట్ 3కి లీడ్ ఇస్తూ అనేక ప్రశ్నలకు సమాధానాలు వదిలేసారు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్, రష్మిక – బన్నీ సీన్స్ కొన్ని ట్రిమ్ చేస్తే ఇంకా బాగుండేది. ఎలాగో 3 గంటల 20 నిముషాలు ఉంది కాబట్టి ఓ 20 నిముషాలు ట్రిమ్ చేస్తే బెటర్. అలాగే కొన్ని డైలాగ్స్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డామినేట్ చేయడంతో సరిగ్గా వినపడట్లేదు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. అల్లు అర్జున్ మాత్రం అదరగొట్టేసాడు. పార్ట్ 1కి మించి ఇంకా అద్భుతంగా నటించాడు. పుష్ప పార్ట్ 1 సినిమాకు నేషనల్ అవార్డు వస్తే దానికి ఎలా ఇచ్చారు అని కొంతమంది కామెంట్స్ చేసారు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడకుండా చేసాడు బన్నీ. పుష్ప 2లో అల్లు అర్జున్ చేసిన నటనకు మాత్రం కచ్చితంగా నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే. ఇక రష్మిక కూడా అదరగొట్టేసింది. ఓ పక్క రొమాన్స్, మరో పక్క ఎమోషన్ తో మంచి భార్య పాత్రలో మెప్పించింది.
భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ బాగానే మెప్పించాడు. సిద్దప్ప పాత్రలో రావు రమేష్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాలో అజయ్ కూతురి పాత్రలో నటించిన పావని అదరగొట్టేసింది. అల్లు అర్జున్, రష్మిక తర్వాత సినిమాలో ఈ నటికి అంత ప్రాధాన్యత ఉన్న మంచి పాత్ర పడింది. కథలో కీలక పాత్ర పోషించింది. అజయ్, పుష్ప తల్లి పాత్రలో నటించిన కల్పలత, బ్రహ్మాజీ, జగపతి బాబు, జగదీశ్, ఆదిత్య మీనన్, శ్రీతేజ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. శ్రీలీల స్పెషల్ సాంగ్ లో తన డ్యాన్స్ తో అదరగొట్టేసింది.
సాంకేతిక అంశాలు.. సినిమాకి టెక్నికల్ టీమ్స్ అన్ని చాలా ప్లస్ అయ్యాయి. సుకుమార్ మూడేళ్లు సమయం తీసుకున్నా మంచి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ అదిరిపోయాయి. కొన్ని షాట్స్ అయితే వావ్ అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అదరగొట్టేసాడు. కానీ కొన్ని మ్యూజిక్స్ మాత్రం గతంలో వేరే సినిమాల్లో విన్నట్టు అనిపిస్తుంది. ఇక పాటలన్ని ఇప్పటికే ఫుల్ వైరల్ అయ్యాయి. సినిమాలో కూడా విజువల్ గా చూడటానికి, వినడానికి బాగున్నాయి.
ఎర్ర చందనం, అడవుల్లో సెటప్ ల కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగా పనిచేసింది. సినిమాలో చాలా లొకేషన్స్ వాడారు, అన్ని అందంగా చూపించారు. అల్లు అర్జున్ కాస్ట్యూమ్ డిజైనర్ బాగా వర్క్ చేసారు. ఈ పాత్రకు స్పెషల్ గా డిజైన్ చేసిన పుష్ప బ్రాండ్ షర్ట్స్ బాగున్నాయి. ఇక సుకుమార్ రైటింగ్, డైలాగ్స్, డైరెక్షన్ తో ఇప్పటికే చాలా సినిమాలతో జీనియస్ అనిపించుకున్నాడు. డైరెక్షన్ లో ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కేసాడు అని చెప్పొచ్చు. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ కథనం సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం స్ట్రాంగ్ గా రాసుకుంటే బాగుండేది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు 500 కోట్లపైనే ఖర్చు పెట్టారు అని వార్తలు వచ్చాయి. ఆ ఖర్చంతా తెరపై గ్రాండ్ గా కనిపిస్తుంది.
మొత్తంగా ‘పుష్ప 2’ సినిమా ఈగోల వల్ల పుష్ప రాజ్ ఎంత దూరమైనా వెళ్తాడు అని మంచి ఎలివేషన్స్ తో అక్కడక్కడా సెంటిమెంట్ తో చూపించారు. ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
Read : తనయుడు మోక్షజ్ఞతో ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ ని అనౌన్స్ చేసిన నందమూరి బాలకృష్ణ